ఫోన్ ట్యాపింగ్, సింగర్ మంగ్లీకి సంబంధించిన కేసులపై స్పందించిన కొత్త డీజీపీ

  • ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చివరి దశకు చేరుకుందన్న సీవీ ఆనంద్
  • త్వరలో రెండో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తామని వెల్లడి
  • తెలంగాణ పోలీసింగ్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని హామీ
రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకుందని, త్వరలోనే సిట్ రెండో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుందని తెలిపారు. ఈ కేసు ఎంత వరకు వచ్చిందో సమీక్ష జరిపిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. సీవీ ఆనంద్ ఈరోజు ఉదయం డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

అనంతరం ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించారంటూ ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోలీసింగ్‌ను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. విప్లవాత్మక మార్పులతో ఇప్పటికే తాము అగ్రస్థానంలో కొనసాగుతున్నామని, పోలీసింగ్ వ్యవస్థలో 'ఏఐ'ని తీసుకువస్తామని తెలిపారు. మహిళల భద్రత, చైల్డ్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ దందాపై దృష్టి సారిస్తామని అన్నారు.

పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుని, ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నక్సలైట్ల నిర్మూలనకు గ్రేహౌండ్స్, ఎస్ఐబీ విభాగాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటామని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను వివిధ రకాలుగా మోసం చేస్తున్నారని, అలాంటి నేరాలను అదుపు చేసేందుకు జిల్లాల వారీగా ఎస్పీలు కార్యాచరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సింగర్ మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ కేసుపై కూడా డీజీపీ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి తనకు పూర్తి సమాచారం లేదని తెలిపారు. ఈ కేసుపై సమీక్ష జరిపిన తర్వాత చెబుతానని అన్నారు.

DGP responds on Phone Tapping case
DGP responds on Singer Mangli case
Telangana New DGP

More Telugu News